అరేబియా రాత్రులు


 పర్షియా దేశంలో ఒక సుల్తాన్ ఉండేవాడు. 

అతను ఎన్నోచోట్ల వెతికి ఒక గుణవంతురాలైన అందమైన స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. 

అతను ఒక్క క్షణం కూడా భార్యను విడవకుండా కాలం గడిపాడు. 

కొంతకాలం తర్వాత పరిపాలన గాలికి ఒదిలేయడం మంచిది కాదు అని గుర్తు చేశాడు వజీరు. 

అప్పటినుంచి సుల్తాను రాణితో గడిపే సమయం తగ్గించి పాలన చూసుకోవడం ప్రారంభించాడు. 

శరీర సుఖానికి రుచి మరిగిన రాణి కొంతకాలం ఆగింది. ఆ తర్వాత ఆగలేకపోయింది. 

కోటలో ఎంతోమంది నీగ్రో బానిసలు సేవకులుగా ఉన్నారు. 

వారిలో ఒకడ్ని చూసుకొని రంకు ప్రారంభించింది. 

ఈ వ్యవహారం కొంతకాలం గుట్టుగా సాగింది. 

ఒక దురదృష్టకరమైన రోజున .. రాణి తన ప్రియుడితో కులుకుతుండగా రాజు చూడనే చూశాడు. 

అతని హృదయం బద్దలైపోయింది. 

రాణిని ప్రాణం కన్నా‍ ఎక్కువగా ప్రేమించాడు అతను. 

ఆమె కలలో కూడా తనను మోసం చేయదని నమ్మాడు అతను. 

బాధ కోపంగా మారింది సుల్తాన్‌కు. 

రాణి, ఆమె నీగ్రో ప్రియుడు రాజు కోపానికి బలైపోయారు. 

రాణి చేసిన నమ్మకద్రోహంతో సుల్తాన్ రాక్షసుడిగా మారిపోయాడు. 

లోకంలోని స్త్రీలందరూ ఇంతే .. భర్తను నమ్మించి చాటుమాటుగా రంకు నడుపుతారు అని అతను నమ్మాడు. 

అంతే .. ఒక క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. 

ప్రతిరోజు ఒక అమ్మాయిని వివాహం చేసుకొనేవాడు. 

ఆ రాత్రి ఆమెతో సుఖపడేవాడు. 

ఉదయాన్నే ఆమెకు మరణశిక్ష విధించేవాడు. 

ఇలా ఎందరో స్త్రీలను చంపేశాడు సుల్తాన్. 

అందులో చెడ్డవాళ్ళున్నారు. మంచివాళ్ళున్నారు. 

చివరకు వజీరు కూతురు సుల్తాన్‌ని కోరి వివాహం చేసుకుంది. 

శోభన కార్యం ముగిసిన తర్వాత ఆమె ఒక కథ చెప్పడం ప్రారంభించింది. 

కథ పూర్తి కాకుండానే రాత్రి గడిచి ఉదయం అయింది. 

కథ వినాలన్న కోరికతో రాజు ఆమెకు ఆ రోజు ప్రాణభిక్ష ప్రసాదించాడు.

ఇలా వెయ్యి రాత్రులు కథ చెప్పింది కొత్తరాణి. 

ఆ కథలు రాజులో మార్పు తెచ్చాయి. 

స్త్రీలలో చెడ్డవాళ్ళే కాదు మంచివాళ్ళు కూడా ఉంటారని అతనికి బోధపడింది. 

రాజు మునుపటిలా మంచివాడయ్యాడు. 

ఇక మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. 

కథల ద్వారా తనలో మార్పు తెచ్చిన వజీరు కూతురు షెహర్జాదాతోనే శేషజీవితం గడిపాడు సుల్తాన్ షహర్యార్. 

ఆ షెహర్జాదె సుల్తాన్‌కు వెయ్యిరాత్రులు చెప్పిన కథలే .. వెయ్యిన్నొక్క రాత్రులు లేదా అరేబియన్ నైట్స్ కథలు. 

- సాయికిరణ్ పామంజి, 22 అక్టోబర్ 2025

Comments

Popular posts from this blog

అంతా మిథ్యే

ధైర్యలక్ష్మి